Crime News

Crime News: నమ్మితే నట్టేట ముంచారు.. బిల్డర్ ఇంట్లో పనిమనుషుల భారీ దోపిడీ

Crime News: బెంగళూరులోని మరాఠాహళ్లిలో ఒక బిల్డర్ ఇంట్లో పని చేస్తున్న నేపాల్ దంపతులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. యజమాని లేని సమయం చూసి ఏకంగా రూ. 18 కోట్ల విలువైన సంపదతో పరారయ్యారు. నమ్మకంగా పని చేస్తారని ఆశ్రయం కల్పిస్తే, ఏకంగా ఇంటికే కన్నం వేయడంతో యజమాని కుటుంబం షాక్‌కు గురైంది.

పక్కా ప్లాన్‌తో దోపిడీ..

ఈ నెల 25వ తేదీన (ఆదివారం) యజమాని తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన ఆ నేపాల్ భార్యాభర్తలు, తమతో పాటు మరో ముగ్గురు సహాయకులను రప్పించుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే సీసీటీవీ కెమెరా వైర్లను కత్తిరించారు. అనంతరం ఇంట్లోని లాకర్లను పగలగొట్టి 11.5 కేజీల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి వస్తువులు మరియు రూ. 11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

ఇది కూడా చదవండి: Danam Nagender: బీఆర్‌ఎస్ యాక్షన్‌కు నా రియాక్షన్ గ్యారెంటీ.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

వెలుగులోకి వచ్చిందిలా..

అదే ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వచ్చి చూడగా లాకర్లు పగిలి ఉండటం గమనించారు. వెంటనే యజమానికి సమాచారం అందించడంతో ఈ భారీ చోరీ విషయం బయటపడింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు యజమాని కదలికలపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టి, పక్కా ప్రణాళికతోనే ఈ పనికి ఒడిగట్టారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసుల దర్యాప్తు..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నేరస్తులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు నేపాల్‌కు చెందిన వారు కావడంతో సరిహద్దుల వద్ద కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పని మనుషులను పెట్టుకునేటప్పుడు వారి వివరాలు మరియు నేపథ్యం (Police Verification) సరిగ్గా తెలుసుకోవాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *