Parliament Budget Session 2026: దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు (బుధవారం, జనవరి 28, 2026) అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా సాగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా, పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషం.
రాష్ట్రపతి ప్రసంగం – ముఖ్యాంశాలు: రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రభుత్వ విజయాలను, భవిష్యత్తు లక్ష్యాలను వివరించనున్నారు. ముఖ్యంగా:
- వికసిత భారత్: దేశాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
- రక్షణ & ఆర్థికం: రక్షణ రంగం ఆధునీకరణ, ఎగుమతులు, జీఎస్టీ సంస్కరణలు.
- సంక్షేమం: రైతు, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి కల్పన, విద్యా-ఆరోగ్య రంగాల్లో పురోగతి.
అఖిలపక్ష భేటీ – వ్యూహప్రతివ్యూహాలు: సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి టీడపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే, సభలో గళమెత్తేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే అజెండా సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉపాధి హామీ బిల్లులు, రూపాయి పతనం, విదేశాంగ విధానంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోంది.
తెలుగు రాష్ట్రాల అజెండా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సిద్ధమయ్యాయి.
- ఏపీ పార్టీలు: అమరావతికి చట్టబద్ధత, నదుల అనుసంధానంపై టీడీపీ దృష్టి పెట్టగా, వైసీపీ రైతుల సమస్యలను లేవనెత్తనుంది.
- తెలంగాణ పార్టీలు: సింగరేణి బొగ్గు వ్యవహారం, నదీ జలాల పంపిణీ, విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై బీఆర్ఎస్ పోరాడేందుకు సిద్ధమైంది.
మొత్తానికి, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం.. ప్రజా సమస్యలే అజెండాగా ప్రతిపక్షాలు తలపడుతుండటంతో ఈ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.
