Kavitha

Kavitha: సీఎం రేవంత్‌కు ఆయన గూఢచారి.. మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో సంతోష్ రావు పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

గతంలో తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమ నాయకుడికి దూరం చేసింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. గద్దర్ వంటి గొప్ప నాయకులు కూడా గేటు బయటే ఉండిపోవాల్సి వచ్చిందంటే అది ఆయన వల్లేనని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ఒక గూఢచారిలా పనిచేస్తున్నారని, తాను మొదటి నుంచి చెబుతున్న దెయ్యం ఆయనేనని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లకు, నేరస్థులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఉంటేనే నేరస్థుల్లో వణుకు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గృహహింస కేసులు కూడా పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడుతూ.. ఈ కేసులో సిట్ విచారణ ద్వారా సంతోష్ రావుకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలన్నారు. అయితే, వ్యవస్థలు ఉన్న తీరు చూస్తుంటే ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు కలగడం లేదని కవిత తన సందేహాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *