Bhatti Vikramarka

Bhatti Vikramarka: ప్రజాభవన్‌లో కీలక భేటీ.. డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన ముగ్గురు మంత్రులు

Bhatti Vikramarka: రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం రాత్రి జరిగిన ఒక భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసమైన ‘ప్రజాభవన్’లో ముగ్గురు కీలక మంత్రులు సమావేశమయ్యారు. గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌లు నేరుగా భట్టి విక్రమార్క వద్దకు వెళ్లారు. ఈ నలుగురు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ నేతల మధ్య ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు ఉంటే, వాటిని ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారు. గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతకుముందే, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా మంత్రి ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు.

మరోవైపు, సింగరేణి సంస్థకు చెందిన నైనీ బొగ్గు గని టెండర్ల రద్దు విషయం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. టెండర్ల రద్దుపై జరుగుతున్న ప్రచారం గురించి భట్టి విక్రమార్క మిగతా మంత్రులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరులో పూర్తి పారదర్శకత ఉండాలన్నదే తమ లక్ష్యమని, అందుకే ఏవైనా ఆరోపణలు రాగానే వెంటనే స్పందించి టెండర్లను రద్దు చేశామని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళ్లాలని మంత్రులు నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *