Telangana:వివిధ రకాల వాహనాలపై హోదాను గుర్తుచేసే కొన్ని స్టిక్కర్లను మనం చూస్తుంటాం. చుట్టాలు, బంధువులు, మిత్రులకు సంబంధించిన హోదాలతో కూడా కొందరు తమ వాహనాలకు ఎంచక్కా స్టిక్కర్లను అతికించుకొని దర్జాగా తిరుగుతుంటారు. ఇక నుంచి అలా స్టిక్కర్లను వేసుకుందామంటే కుదరదు. గుర్తింపు ఉంటేనే స్టిక్కర్లను అతికించుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ప్రభుత్వం ఏకంగా జీవోనే జారీచేసింది.
Telangana:వాహనాలపై ఎలాంటి గుర్తింపు లేకున్నా ప్రెస్, పోలీస్, అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ తదితర స్టిక్కర్లు వేసుకునే వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. తమ వాహనాలపై అనధికారికంగా వృత్తిపరమైన పేర్లు, ప్రభుత్వ చిహ్నాలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. తాజాగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ విడుదల చేసి జీవోతో ఆ విషయం తేటతెల్లమైంది.
Telangana:సమాచార పౌరసంబంధాల శాఖ నుంచి అక్రెడిటేషన్ (గుర్తింపు) పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అనే స్టిక్కర్‌ను అతికించుకోవాలి. గుర్తింపు లేని జర్నలిస్టులు ఇతరులు ప్రెస్ అనే స్టిక్కర్‌ను తమ వాహనాలపై ఉపయోగించరాదు. ఒకవేళ అలాంటి వారు అతికించుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పక తీసుకుంటామని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తెలిపారు.
