77th Republic Day: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా భారత రక్షణ శక్తి, సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాల ముందు సాక్షాత్కరించాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌తో పాటు ఐరోపా సమాఖ్యకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ వేడుకలకు సాక్ష్యంగా నిలిచారు. ముఖ్యంగా జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ‘వందేమాతరం’ అనే ఇతివృత్తంతో (థీమ్), ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన గీతం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఏడాది పరేడ్‌లో భారత సైన్యం మునుపెన్నడూ లేని విధంగా తన యుద్ధ తంత్రాన్ని ప్రదర్శించింది. ‘ఫేజ్డ్ బ్యాటిల్ అర్రే’ విధానంలో డ్రోన్లు, ఆర్టిలరీ, ట్యాంకులను యుద్ధ రంగంలో మోహరించినట్లుగా కవాతు నిర్వహించి మన బలగాల సన్నద్ధతను చాటిచెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించిన ఆయుధ వ్యవస్థలతో పాటు బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైళ్లు, 300 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే ‘సూర్యాస్త్ర’ రాకెట్ లాంచర్లు, అర్జున్ యుద్ధ ట్యాంకులు పరేడ్‌లో ధీరత్వాన్ని ప్రదర్శించాయి. సుమారు 6,050 మంది సైనికులు పాల్గొన్న ఈ కవాతులో తొలిసారిగా భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్ వంటి సరికొత్త విభాగాలను ప్రపంచానికి పరిచయం చేశారు.
Also Read: Padma Shri: రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు పద్మశ్రీ!
వేడుకల్లో మరో ఆకర్షణీయమైన ఘట్టం వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన. మొత్తం 30 శకటాలు కర్తవ్యపథ్‌పై కదిలిరాగా, అందులో 17 రాష్ట్రాలకు చెందినవి, 13 కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందినవి ఉన్నాయి. ముఖ్యంగా అసోం, బిహార్ రాష్ట్రాల శకటాలు వాటి సంప్రదాయాలను చాటిచెప్పగా, ‘భారతీయ న్యాయ సంహిత’ థీమ్‌తో వచ్చిన శకటం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే, రొటేషన్ పద్ధతి కారణంగా ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శకటాలకు పరేడ్‌లో అవకాశం లభించలేదు. రాష్ట్రపతి భవన్ నుండి గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి, విదేశీ అతిథులు రావడం, వైమానిక దళ హెలికాప్టర్ల విన్యాసాలు ఈ వేడుకను అంబరాన్నంటేలా చేశాయి.
