Rajnikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసును నిరూపించారు. పేదలకు సేవ చేస్తున్న ఓ వీరాభిమానిని ప్రత్యేకంగా ప్రశంసించి, అతనికి విలువైన బహుమతిని అందించడం ద్వారా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడంలో తలైవా ముందుంటారని మరోసారి చాటుకున్నారు.
మధురైకు చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి రజనీకాంత్‌కు వీరాభిమాని. ఆయన తన హోటల్‌లో పేదలకు కేవలం ఐదు రూపాయలకే పరోటాలను విక్రయిస్తూ ఆకలి తీర్చే సేవ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, శేఖర్‌ను మరియు అతని కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. అక్కడ శేఖర్ చేస్తున్న సేవను మనస్ఫూర్తిగా ప్రశంసించిన తలైవా, ప్రోత్సాహకంగా అతనికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు రజనీకాంత్ సేవాగుణాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే తన తదుపరి సినిమా గురించి కూడా కీలక అప్‌డేట్ ఇచ్చారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘తలైవర్ 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని రజనీకాంత్ వెల్లడించారు.
