Vijay Thalapathy

Vijay Thalapathy: డీఎంకే ‘దుష్టశక్తి’.. అన్నాడీఎంకే ‘అవినీతి శక్తి’..

Vijay Thalapathy: తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటూ ‘తమిళగ వెట్రి కజగమ్‌’ (TVK) పార్టీని స్థాపించిన నటుడు విజయ్, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సమరశంఖం పూరించారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో విజయ్ తన రాజకీయ వ్యూహాలను స్పష్టం చేయడమే కాకుండా, ఎన్నికల సంఘం కేటాయించిన ‘విజిల్’ గుర్తును అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తన ‘బిగిల్’ సినిమాలోని పాపులర్ డైలాగ్ “కప్పు ముఖ్యం బిగులు” అంటూ విజిల్ వేయడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై విజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు కేవలం ఓట్ల కోసం జరిగేవి కాదని, ఇదొక ‘ప్రజాస్వామ్య యుద్ధం’ అని ఆయన అభివర్ణించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాయని మండిపడ్డారు. డీఎంకేను ‘దుష్టశక్తి’గా, అన్నాడీఎంకేను ‘అవినీతి శక్తి’గా పేర్కొంటూ.. ఆ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తలొగ్గాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు టీవీకే మాత్రమే నిజమైన ప్రత్యామ్నాయమని ఆయన ఉద్ఘాటించారు.

ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: మహిళా అధికారులపై చిన్నచూపు ఎందుకు?

తనపై జరుగుతున్న ఒత్తిడి రాజకీయాల గురించి విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. సీబీఐ విచారణలు లేదా తన సినిమాల విడుదలకు కలిగే ఆటంకాలను చూసి తాను భయపడబోనని స్పష్టం చేశారు. “ఈ ముఖం చూస్తే ఒత్తిడికి తలొగ్గేలా కనిపిస్తోందా?” అని ప్రశ్నిస్తూ తన గళం వినిపించారు. ప్రజల విశ్వాసమే తన బలమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా వ్యతిరేక శక్తులతో రాజీపడబోనని తేల్చిచెప్పారు.

పార్టీ శ్రేణులను తన ‘కమాండోలు’గా అభివర్ణించిన విజయ్, అవినీతిపై సమరభేరి మోగించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనూహ్యంగా ఆయనకు ఎంతో సుపరిచితమైన ‘విజిల్’ గుర్తు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా, విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మూడవ పెద్ద శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *