Mantena : వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగా–నేచురోపతి విభాగం సలహాదారుగా నియమితులయ్యారు. క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవిని స్వీకరించినప్పటికీ, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు లేదా ఇతర సౌకర్యాలు ఏవీ తీసుకోబోనని ఆయన సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రజల ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించకూడదనే సూత్రంతో తాను నిస్వార్థంగా సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ‘సంజీవని’ వంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఆయన సూచనలు అవసరమని సీఎం భావించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంతెనతో సుదీర్ఘంగా చర్చించి, అధికారిక పదవిని స్వీకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
మొదట్లో ఈ పదవిని స్వీకరించేందుకు తాను వెనుకంజ వేసినట్లు మంతెన వెల్లడించారు. తెరవెనుక నుంచే సలహాలు ఇస్తానని చెప్పినా, అధికారిక హోదా ఉంటేనే సూచనలకు విలువ పెరుగుతుందని, పనులు వేగంగా జరుగుతాయని సీఎం నచ్చజెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థనను తిరస్కరించలేక చివరకు పదవిని స్వీకరించడానికి అంగీకరించినట్లు చెప్పారు.
అయితే, ఈ బాధ్యతలు చేపట్టేందుకు కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్లు మంతెన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోనని, ప్రభుత్వ వాహనం సహా ఎలాంటి సౌకర్యాలు వినియోగించుకోనని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ షరతులకు సీఎం అంగీకరించిన తర్వాతే బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన చెప్పారు.
గత 35 సంవత్సరాలుగా తన పుస్తకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నానని, తాను నిర్వహిస్తున్న ఆశ్రమం నుంచి కూడా జీతం తీసుకోలేదని మంతెన తెలిపారు. ప్రభుత్వ ధనం ప్రజలదేనని, దాన్ని స్వీకరించకూడదనేది తన జీవిత నియమమని పేర్కొన్నారు. నిస్వార్థ సేవ చేయాలనే ఆయన నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
