CM Stalin

CM Stalin: తమిళనాడులో హిందీకి చోటు లేదు: సీఎం స్టాలిన్ స్పష్టం

 CM Stalin: తమిళనాడు గడ్డపై హిందీ భాషా ఆధిపత్యానికి ఎప్పటికీ చోటు లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చూస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆదివారం జరిగిన ‘తమిళ భాషా అమరవీరుల దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమిళ భాషా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు. తమిళులు తమ మాతృభాషను ప్రాణంగా ప్రేమిస్తారని, దానిని తక్కువ చేసేలా కేంద్రం తీసుకునే ఏ చర్యలనైనా తాము సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదనే సాకుతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన నిధులను నిలిపివేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. నిధులు రాకపోయినా భాషా విషయంలో రాజీ పడేది లేదని, భవిష్యత్తులో కూడా తమిళనాడులో హిందీకి స్థానం ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, 1965 నాటి ఉద్యమ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read: Harish Rao: భ‌ట్టీ ఇవిగో ఆధారాలు.. సింగ‌రేణిపై హ‌రీశ్‌రావు కీల‌క ఆరోప‌ణ‌లు

ముఖ్యంగా 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఆనాడు భాషా పరిరక్షణ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. ఆ అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 25ను అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది. తమిళ సంస్కృతిని, భాషను కించపరిచేలా ఏవైనా ప్రయత్నాలు జరిగితే గతంలో చేసినట్టే మరోసారి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *