US Tariffs: భారత్‌పై 25 శాతం సుంకాలు తగ్గే ఛాన్స్..! అమెరికా మంత్రి కీలక హింట్

US Tariffs: అమెరికా నుంచి దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల విషయంలో భారత ఎగుమతిదారులకు త్వరలోనే పెద్ద ఊరట లభిస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంపై అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్‌లను సగానికి సగం, అంటే 25 శాతానికి తగ్గించే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సానుకూల మార్పు గురించి వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గత ఏడాది ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం రెండు వేర్వేరు కారణాలతో భారత్‌పై భారీ పన్నులు విధించింది. వాణిజ్య అసమతుల్యతను అదుపు చేయడానికి ఒక 25 శాతం సుంకాన్ని, అలాగే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు శిక్షాత్మక చర్యగా మరో 25 శాతం అదనపు సుంకాన్ని అమలు చేసింది. వెరసి 50 శాతానికి చేరిన ఈ పన్నుల భారం వల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, రష్యా చమురుపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవడం తమ విధానానికి లభించిన విజయమని అమెరికా భావిస్తోంది. అందుకే ఆ అదనపు 25 శాతం ‘సెకండరీ సుంకాన్ని’ ఉపసంహరించుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైందని స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు.

Also Read: IndiGo Flights: డిసెంబర్‌ దెబ్బ.. ఇండిగోకు బిగ్ షాక్ ..

ఈ పరిణామం ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య నేరుగా చర్చలు జరగకపోవడం వల్లే కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి నుంచి వచ్చిన ఈ ప్రకటన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతాయనే ఆశలను చిగురింపజేస్తోంది. ఈ పన్ను తగ్గింపు గనుక అధికారికంగా అమలులోకి వస్తే, అమెరికా మార్కెట్‌లోకి భారతీయ వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చి, భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *