Vizag: వైజాగ్ లో వింత.. మందుకు పైసలు లేవని ఆర్టీసీ బస్సు దొంగతనం..

Vizag: విశాఖపట్నంలో ఓ వింత దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో బస్సును దొంగిలించి అందులోని డీజిల్ అమ్ముకుని మద్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం, టీవీ నాయుడు అనే వ్యక్తి తన ఆరు బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ నెల 16న రాత్రి శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏపీ 39యూఎక్స్ 2888 నంబర్ గల బస్సును డ్రైవర్ అప్పారావు మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు మద్దిలపాలెం డిపోతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించగా, యజమాని దగ్గర పనిచేసే మరో డ్రైవర్ ఈగల పైడిరాజు అనకాపల్లి జిల్లా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ నెల 19న రామా టాకీస్ సమీపంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రి దగ్గర పైడిరాజు బస్సును నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో తాను మద్యానికి బానిసనని, డీజిల్ అమ్ముకుని ఆ డబ్బుతో మద్యం తాగాలనే ఉద్దేశంతో బస్సును దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

ఇది పైడిరాజుకు ఇదే మొదటి నేరం కాదని పోలీసులు వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో కూడా ద్వారకానగర్ బస్టాండ్‌లో ఇదే యజమానికి చెందిన బస్సును దొంగిలించి డీజిల్ అమ్ముకుని డబ్బులు సంపాదించి, తర్వాత బస్సును హైవేపై వదిలేసిన ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో విశాఖలో భద్రతపై చర్చ మొదలైంది. బస్సు డిపోల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *