Gali Janardhan Reddy

Gali Janardhan Reddy: రాజకీయ కక్షసాధింపా?..జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు

Gali Janardhan Reddy: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బళ్లారిలోని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సుమారు రూ. 3 కోట్ల విలువైన విలాసవంతమైన మోడల్ హౌస్‌ను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కోసం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్న సమయంలో ఈ దాడి జరగడం సంచలనం సృష్టించింది.

బళ్లారి శివార్లలోని ‘జీ స్క్వేర్ లేఅవుట్’లో ఉన్న ఈ ఇంటిలోకి చొరబడిన దుండగులు.. మొదట కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్ మరియు ఇతర అలంకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: Phone Tapping Case: నెక్స్ట్ కేసీఆర్ కాదు.. ఫోన్ ట్యాపింగ్ విచారణకు కవిత..?

ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన నేరుగా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బ్యానర్ల ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం, కాల్పుల ఆరోపణల నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావునిస్తోంది.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనతో బళ్లారిలో రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *