Vangalapudi Anitha

Vangalapudi Anitha: పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలి

Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఆమె సరదాగా ముచ్చటించారు. విద్యార్థులు తమకు ఆడుకోవడానికి ఒక మంచి క్రీడా మైదానం కావాలని కోరగా, హోంమంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే మైదానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో కలిసి ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువుకునే వయసులో చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థికి దేశంలోని చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉండాలని ఆమె సూచించారు. చట్టాల పట్ల అవగాహన ఉంటే తప్పులు జరగకుండా జాగ్రత్త పడొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *