Infosys: ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగుల విద్యుత్ వినియోగంపై ఒక వినూత్నమైన సర్వేను ప్రారంభించింది. సాధారణంగా కంపెనీలు తమ ఆఫీసుల్లో అయ్యే కరెంటు ఖర్చుల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ, ఇన్ఫోసిస్ మాత్రం ఒక అడుగు ముందుకేసి, ఉద్యోగులు తమ ఇళ్లలో ఎంత విద్యుత్తు వాడుతున్నారు? ఏయే ఉపకరణాలు ఉపయోగిస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తోంది.
దీని వెనుక ఒక ముఖ్యమైన పర్యావరణ లక్ష్యం ఉంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్ (కొన్ని రోజులు ఆఫీసు, మరికొన్ని రోజులు ఇంటి నుండి) పద్ధతిలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ఇంటి నుండి పనిచేస్తున్నప్పుడు వాడే ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు మరియు కంప్యూటర్ల వల్ల కూడా పర్యావరణానికి హాని చేసే కర్బన ఉద్గారాలు (Carbon Emissions) విడుదలవుతాయి. కంపెనీని పూర్తిగా ‘కార్బన్ న్యూట్రల్’గా (పర్యావరణానికి హాని చేయని సంస్థగా) ఉంచాలనే లక్ష్యంతో, ఈ ఉద్గారాలను కూడా లెక్కించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది.
ఇది కూడా చదవండి: Nathan Ellis: టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆసీస్‌కు షాక్
ఈ సర్వేలో భాగంగా ఉద్యోగులు వాడే బల్బుల వాటేజీ, ఏసీలు, హీటర్ల వినియోగం మరియు ఎవరైనా సోలార్ పవర్ వాడుతున్నారా? వంటి వివరాలను అడుగుతున్నారు. ఇలా సేకరించిన సమాచారం ఆధారంగా, ఇంటి వద్ద ఎంత కరెంటు ఖర్చవుతుందో అంచనా వేసి, దానికి సమానమైన స్థాయిలో క్లీన్ ఎనర్జీని (సౌర విద్యుత్ వంటివి) ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఇన్ఫోసిస్ ఇప్పటికే తన ఆఫీసు అవసరాల్లో 77 శాతానికి పైగా పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) ద్వారానే పొందుతోంది. కర్ణాటకలో సొంతంగా 60 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను కూడా నడుపుతోంది. ఉద్యోగుల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం మరింత ఖచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ స్పష్టం చేసింది. భారత ఐటీ రంగంలో ఇలాంటి విభిన్నమైన ఆలోచన చేసిన మొదటి కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది.
