CM Chandrababu: నేటి శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 11:00 గంటలకు నగరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. అక్కడ ఆయనకు అధికారులు, స్థానిక నేతలు ఘనస్వాగతం పలికిన అనంతరం, ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారు. సామాన్యుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చారు.
అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి శాప్ (SAP) క్రీడా మైదానానికి చేరుకుని, అక్కడ నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజా వేదికలో పాల్గొంటారు. ఈ వేదికగా పారిశుధ్య నిర్వహణ కోసం చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాల మండలాలకు ప్రత్యేకంగా కేటాయించిన ‘స్వచ్ఛ రథాలను’ (చెత్త సేకరణ వాహనాలు) జెండా ఊపి ప్రారంభిస్తారు. పారిశుధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ, ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు.
పర్యావరణ హిత కార్యక్రమాలు, ఆసుపత్రి సందర్శన
ముఖ్యమంత్రి ఈ పర్యటనలో వినూత్నమైన ‘నెట్ జీరో వేస్ట్’ (Net Zero Waste) కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 1:50 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించి, అక్కడ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ హిత పద్ధతులను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి వసతులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు నగరి ఏరియా ఆసుపత్రికి వెళ్లి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు.
పార్టీ శ్రేణులతో సమావేశం
అభివృద్ధి కార్యక్రమాల అనంతరం, మధ్యాహ్నం 2:40 గంటలకు జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. ఈ కీలక పర్యటన ముగించుకుని సాయంత్రం 3:55 గంటలకు హెలిప్యాడ్ నుంచి తిరిగి అమరావతికి బయలుదేరుతారు. ఈ పర్యటన దృష్ట్యా నగరి పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
