Kishan Reddy: సింగరేణి సంస్థను గత పదేళ్లుగా పాలకులు దోపిడీ చేశారని, దీనివల్ల కార్మికుల ఆస్తిగా ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంస్థ అప్పులు ఏకంగా 32 వేల కోట్ల రూపాయలకు పెరిగాయని, నాటి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే సింగరేణికి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ సంస్థలు సింగరేణి నుంచి విద్యుత్తును వాడుకుని దానికి చెల్లించాల్సిన బకాయిలను ఆపేయడం వల్ల సంస్థపై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గతంలో సీఎండీ పదవీకాలాన్ని పొడిగించారని, ప్రస్తుతం కూడా పూర్తిస్థాయి సీఎండీ లేక ఇన్‌ఛార్జ్‌తోనే కాలం గడుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read: Harish Rao: నిన్న నాకు ఇవాళ కేటీఆర్ కి.. ఇదంతా ఆటెన్షన్ డైవర్షన్
సింగరేణి ఆదాయం గణనీయంగా తగ్గి ఖర్చులు పెరగడానికి గత పాలకుల అవినీతి విధానాలే కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. సంస్థకు రావాల్సిన లాభాలను కార్మికులకు పంచకుండా, సుమారు 47 వేల కోట్ల రూపాయల బకాయిలను కార్మికులకు ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ప్రయత్నించిందని, చివరకు టెండర్లను కూడా రద్దు చేసిందని గుర్తు చేశారు. సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అజమాయిషీ చేయలేదని, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ఈ సంస్థను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా అదే తీరు కొనసాగుతోందని, ఇప్పటికైనా సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
