KTR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, 160 CRPC కింద ఈ నోటీసులను అందజేశారు. జనవరి 23వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆయన విచారణ ముగిసిన వెంటనే కేటీఆర్‌కు కూడా నోటీసులు అందడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో ఏర్పాటైన 9 మంది సభ్యుల ప్రత్యేక బృందం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న లోతైన కోణాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే విచారణలో కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
