Nara Lokesh

Nara Lokesh: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి చట్టాన్ని తెచ్చిందని, దాన్ని తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు.

చిన్న వయసు పిల్లలకు సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను అర్థం చేసుకునేంత పరిణతి ఉండదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వారు ఏది చూస్తున్నారు, దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది వాళ్లకు తెలియదు కాబట్టి, వారిని కాపాడుకోవడానికి ఒక బలమైన చట్టం అవసరమని ఆయన అన్నారు. అందుకే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లల కోసం తెచ్చిన ‘అండర్-16’ చట్టాన్ని ఏపీలో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Also Read: T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ సంచలన నిర్ణయం?

మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి కూడా స్పందించారు. సోషల్ మీడియా వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, ఆన్‌లైన్‌లో ఉండే ప్రమాదకరమైన విషయాల నుంచి వాళ్లను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. గతంలో సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తూ మహిళలపై అసభ్యకర దాడులు చేశారని, ఇప్పుడు పిల్లలను అలాంటి నెగెటివిటీ నుంచి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తే, మన దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఇది గనుక అమల్లోకి వస్తే ఇకపై చిన్న పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లు వాడటంపై కఠినమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *