TG High Court: తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ (గురువారం) తీర్పు వెలువరించాల్సి ఉండగా, దానిని ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తీర్పు ప్రతి ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవడమే ఈ జాప్యానికి కారణమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది.
ఈ తీర్పు పైన సుమారు 563 మంది ఎంపికైన అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. వీరంతా ఇప్పటికే ప్రభుత్వం నుంచి నియామక పత్రాలు (అప్పాయింట్‌మెంట్ లెటర్లు) అందుకుని విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. పరీక్షల మూల్యాంకనాన్ని మళ్లీ జరపాలని లేదా అవసరమైతే పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ (TGPSSC) డివిజన్ బెంచ్ వద్దకు వెళ్లింది.
ఇది కూడా చదవండి: Tranfers: 42 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం
కోర్టులో జరిగిన వాదనల సమయంలో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. పరీక్షల ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శక నిబంధనల ప్రకారమే జరిగిందని వివరించారు. మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు నిపుణులతో పేపర్లను దిద్దించామని కోర్టుకు తెలిపారు. మరోవైపు ఎంపికైన అభ్యర్థుల తరపున న్యాయవాదులు వాదిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించని వారు ఉద్దేశపూర్వకంగానే నియామకాలను అడ్డుకోవడానికి కోర్టుకు వచ్చారని ఆరోపించారు.
హైకోర్టు వెలువరించబోయే ఈ తీర్పు అటు ఎంపికైన అభ్యర్థులకు, ఇటు పరీక్షలో లోపాలున్నాయని ఆరోపిస్తున్న అభ్యర్థులకు అత్యంత కీలకం కానుంది. ఫిబ్రవరి 5న వచ్చే తుది తీర్పుతో ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
