Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెదచందల గ్రామంలో మరణించిన జనసేన క్రియాశీల కార్యకర్త చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఆయన బుధవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయలు బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆ కఠిన సమయంలోనూ ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలించింది.
తమ వారు ఇక తిరిగి రారని తెలిసినా, మరొకరికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో రాయలు అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ గొప్ప నిర్ణయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి రాయలు చిత్రపటానికి నివాళులర్పించారు. మృతుడి భార్య, పిల్లలను కలిసి వారిని ఓదార్చి, మనోధైర్యాన్ని నింపారు.
Also Read: Deepinder Goyal: జొమాటో సీఈఓ పదవి నుంచి దీపిందర్ గోయల్ రాజీనామా..!
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కన్నవారు, ఉన్నవారు దూరమైన దుఃఖంలో ఉండి కూడా, అవయవ దానం చేయడానికి ముందుకు రావడం సామాన్యమైన విషయం కాదు. రాయలు కుటుంబం చూపిన ఈ గుండె ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన ఈ నిర్ణయం నన్ను ఎంతో చలింపజేసింది అని కొనియాడారు.
సహాయం అందించడంలో భాగంగా రాయలు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అలాగే, రాయలు కుమార్తె ఎదుర్కొంటున్న వినికిడి లోపం గురించి తెలుసుకున్న ఆయన, ఆ చిన్నారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే ‘శ్రవణం’ ప్రాజెక్టు ద్వారా మెరుగైన చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం తరఫున త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
