Ghaziabad

Ghaziabad: ఎగ్ కర్రీ కోసం.. భార్య, భర్త నాలుక కోరింది!

Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం గుడ్డు కూర గ్రేవీ గురించి అడిగినందుకు ఒక భార్య తన భర్త నాలుకను పళ్లతో బలంగా కొరికి రెండు ముక్కలు చేసింది. సంజయ్‌పురి ప్రాంతానికి చెందిన విపిన్ అనే యువకుడికి ఏడాది క్రితమే ఇషాతో వివాహమైంది. అయితే పెళ్లయిన నెల రోజుల నుండే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన ఇష్టప్రకారం జీవిస్తానని ఇషా తరచూ గొడవపడేదని, అందుకే విపిన్ తన తల్లిదండ్రుల నుండి వేరుగా అదే ఇంటిపై అంతస్తులో భార్యతో కలిసి నివసిస్తున్నాడని విపిన్ తల్లి గీత వాపోయారు.

ఘటన జరిగిన రోజు ఎగ్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య దాదాపు రెండు గంటల పాటు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇషా తన భర్తను పలుమార్లు కొట్టింది. గొడవను సద్దుమణిగేలా చేయడానికి విపిన్ ప్రయత్నిస్తున్న సమయంలో, ఆమె ఒక్కసారిగా అతడిపై దాడి చేసి నాలుకను అత్యంత క్రూరంగా కొరికేసింది. ఈ దాడిలో విపిన్ నాలుకలో ఒక భాగం పూర్తిగా తెగిపోయింది. విపరీతమైన రక్తస్రావం అవుతుండటంతో, విపిన్ తన తెగిపోయిన నాలుక ముక్కను చేతిలో పట్టుకుని  కింద ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు.

Also Read: Rupee Value: చారిత్రక కనిష్ఠానికి రూపాయి పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 91.74కు చేరిక

కొడుకు పరిస్థితి చూసి షాక్‌కు గురైన తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు ఇషాను కిందకు పిలిపించి నిలదీశారు. స్థానికులు ఆగ్రహంతో ఆమెపై దాడి చేయగా, తాను కావాలనే భర్త నాలుక కొరికినట్లు ఆమె అంగీకరించింది. వెంటనే విపిన్‌ను మీరట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ పరీక్షించిన వైద్యులు తెగిపోయిన నాలుకను తిరిగి అతికించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీనివల్ల విపిన్ జీవితాంతం మాట్లాడే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విపిన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇషాను అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *