Ponnam Prabhakar: సింగరేణి గనుల కేటాయింపుల విషయంలో గత ప్రభుత్వ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతలు సింగరేణిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో 21 గనులను కేటాయిస్తే, అందులో ఒక గనిని మైనస్‌లో ఇచ్చారని, కానీ తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గనిని కూడా మైనస్‌లో ఇవ్వలేదని ఆయన వివరించారు. సింగరేణి అంశంపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత పదేళ్లలో జరిగిన టెండర్ల కేటాయింపులపై విచారణకు సిద్ధమా అని బీఆర్‌ఎస్ నేతలకు సవాలు విసిరారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 30 శాతం అధిక ధరలకు టెండర్లను అప్పగించిందని, ఆ సమయంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు ఇప్పుడు చెడ్డవాళ్లయ్యారా అని మంత్రి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా పారదర్శకత కోరుకుంటే విచారణ చేయాలని కోరుతూ లేఖ రాయాలని సూచించారు.
Also Read: APY Scheme: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో ఐదేళ్లు పొడిగింపు
అసెంబ్లీలో హిల్ట్ (HILT) పాలసీపై చర్చకు అవకాశం ఇస్తే బీఆర్‌ఎస్ నేతలు పారిపోయారని, వారికి చర్చించే దమ్ము లేదని మంత్రి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, అవినీతిపై కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తూ, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతూ, ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుకుంటే ఒక్క గంటలో దీన్ని అమలు చేయడం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
