Nitin Nabin: భారతీయ జనతా పార్టీ (BJP) సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పార్టీ 12వ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ ఎన్నిక ప్రక్రియ చాలా పారదర్శకంగా సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్ర యూనిట్లలో మెజారిటీ రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ జాతీయ అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించారు. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Naa Anveshana: 2026 బెస్ట్ స్పీచ్ ఇదే.. రేణు దేశాయ్ కి సపోర్ట్ ఇస్తున్న అన్వేష్
ఆయనకు పోటీగా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో, జాతీయ ఎన్నికల అధికారి కె. లక్ష్మణ్ ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. 45 ఏళ్ల వయసులోనే ఈ పదవిని చేపట్టిన నితిన్ నబీన్, బీజేపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు.
ఈ బాధ్యతల స్వీకార వేడుకకు పార్టీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని అగ్రనేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
