Harish Rao

Harish Rao: అవినీతిని ప్రశ్నిస్తే నోటీసులా?

Harish Rao: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది అవినీతి బాగోతం బయటపడటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు తెరలేపారని ఆయన ఆరోపించారు.

నిన్న ఉదయం తాను ప్రభుత్వ అవినీతిని ఎండగడితే, రాత్రి 9 గంటలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విచారణకు రమ్మనడం వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనేది ఆయన ప్రధాన వాదన. “మేము ఏ తప్పూ చేయలేదు, కాబట్టి ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. గతంలో ఇదే కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేసినా, ప్రభుత్వం కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది” అని హరీష్ రావు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Donald Trump: గ్రీన్‌లాండ్ వేటలో ట్రంప్.. యూరప్ దేశాలపై టారిఫ్ వార్!

ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల కుంభకోణంపై ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొగ్గు టెండర్లలో భారీ అక్రమాలకు పాల్పడుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బలం పెరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం రేవంత్ రెడ్డిలో మొదలైందని ఎద్దేవా చేశారు.

ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, నైని బ్లాక్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *