Revanth Reddy: ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో అణాపైసా అవినీతికి కూడా ఆస్కారం లేదని, అనుభవం ఉన్న కంపెనీలకే టెండర్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మంత్రులను బద్నాం చేయొద్దు
మీడియా సంస్థల మధ్య ఏవైనా గొడవలు ఉంటే అవి మీరు చూసుకోవాలి తప్ప, ఆ వివాదాల్లోకి మంత్రులను లాగడం సరికాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. “మీకు మీకు పంచాయితీలు ఉంటే తలుపులు మూసుకుని కొట్టుకోండి.. కానీ మంత్రులపై తప్పుడు వార్తలు రాసి వారిని బద్నాం చేయకండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలోని సహచరులపై వార్తలు వస్తే అది తన గౌరవానికి భంగం కలిగించినట్లేనని, తన నాయకత్వంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు
వివరణ కోరండి.. వాస్తవాలు రాయండి
క్యాబినెట్ మంత్రులపై ఏదైనా వార్త రాసేముందు తన దగ్గర వివరణ తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం తరఫున వాస్తవాలు వెల్లడించేందుకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. ఇటువంటి అసత్య వార్తల వల్ల ప్రత్యర్థులు బలపడే అవకాశం ఉందని, మీడియా యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
అభివృద్ధిపైనే మా దృష్టి
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వలేదని, అందరం సమన్వయంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో సుమారు రూ. 362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, రాష్ట్ర సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు.
