Free bus: మగవారికి కూడా ఫ్రీ బస్..

Free bus: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కీలక హామీలను ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఐదు ముఖ్య ఎన్నికల వాగ్దానాలను వెల్లడించారు. ఈ స్కీమ్‌లతో సాధారణ కుటుంబాలకు మరియు పేదలకు ఉపశమనం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

పళనిస్వామి ప్రకటించిన పథకాలలో పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహిళలకు ఇప్పటికే అందిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పురుషులకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇది నగరాల్లో రోజూ ఉద్యోగాలకు వెళ్లే వర్గానికి పెద్ద సహాయంగా ఉంటుందని చెప్పారు.

అలాగే ప్రతి కుటుంబంలో మహిళా యజమానికి నెలకు రూ.2,000 జమచేసే ‘మగళీర్ కులవిళక్కు’ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పట్టణాల్లో అపార్ట్ మెంట్ల పంపిణీ, ఎస్సీ జంటలకు ప్రత్యేక స్థల కేటాయింపు కూడా ఈ హామీల్లో భాగం. అదనంగా, 5 లక్షల మహిళలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ అందించే ‘అమ్మ టూ వీలర్’ స్కీం‌ను తిరిగి అమలు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పళనిస్వామి, డీఎంకే తమ పథకాలను గతంలో కాపీ కొట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. వారు పాలనలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ బలపడిందని, కరోనా కాలంలో కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందించగలిగామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అన్నాడీఎంకేకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *