Vande Bharat Sleeper

Vande Bharat Sleeper: రైల్వే చరిత్రలో కొత్త మైలురాయి.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

Vande Bharat Sleeper:  భారత రైల్వే వ్యవస్థ ఆధునీకరణలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జనవరి 17, 2026) మాల్డా రైల్వే స్టేషన్ వేదికగా దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. హౌరా, గువహతి (కామాఖ్య) మధ్య నడిచే ఈ అత్యాధునిక రైలు, సుదూర ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచనుంది. ఈ సందర్భంగా ప్రధాని రైలులోని బోగీలను పరిశీలించి, అందులో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి ఉత్సాహాన్ని పంచుకున్నారు.

ఈ సరికొత్త స్లీపర్ రైలు ప్రయాణికులకు విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలను తక్కువ ధరకే అందించడానికి సిద్ధమైంది. రాత్రిపూట ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలులో 11 ఏసీ త్రీ టైర్, 4 ఏసీ టూ టైర్, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌తో కలిపి మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. హౌరా నుండి గువహతి మార్గంలో ప్రయాణ సమయాన్ని ఇది దాదాపు 2.5 నుండి 3 గంటల వరకు తగ్గిస్తుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని డిజైన్ చేసినప్పటికీ, ప్రస్తుతం 120-130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడపనున్నారు.

Also Read: Kangana Ranaut: న్యాయం జరిగింది: కంగనా భావోద్వేగం

ప్రయాణికుల భద్రత, సౌకర్యం విషయంలో రాజీ పడకుండా ఎన్నో మార్పులు చేశారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు, శబ్దం తక్కువగా వచ్చేలా రూపొందించిన క్యాబిన్లు, ఎర్గోనామిక్ డిజైన్‌తో కూడిన మృదువైన బెర్తులు ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. అంతేకాకుండా, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు హాట్ వాటర్ షవర్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతాలకు ఈ రైలు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటి మరో 12 స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ప్రాంతీయ వ్యాపారం, పర్యాటక రంగానికి కూడా భారీ ఊతాన్ని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *