CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరి 18వ తేదీన వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లులు కొలువై ఉన్న ములుగు జిల్లాలోని మేడారం వెళ్లనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు, కొందరు కీలక ఉన్నతాధికారులు కూడా మేడారం వెళ్తారు. జనవరి 28 నుంచి మూడు రోజులపాటు మహా మేడారం జాతరను పురస్కరించుకొని సీఎం సహా మంత్రులు అక్కడ పర్యటించనున్నారు.
CM Revanth Reddy: మేడారం జాతర ప్రారంభం కాక ముందే రోజుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున జాతర సందడి నెలకొన్నది. ఈ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోట్లాది రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టింది. ఆయా పనులు కూడా పూర్తికావచ్చాయి. ఈ నేపథ్యలో సీఎం, మంత్రుల పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకున్నది.
CM Revanth Reddy: మేడారం చేరుకున్నాక తొలుత సీఎం రేవంత్రెడ్డి గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. అనంతరం ములుగులోని హరిత హోటల్లో జరిగే మంత్రివర్గ భేటీలో మంత్రులతో సహా పాల్గొననున్నారు. మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో సీఎం, మంత్రులు పాల్గొననున్నారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఉన్నతాదికారులు రెండు రోజులు మేడారంలోనే బస చేయనున్నారు.
CM Revanth Reddy: ఈ మేరకు సీఎం, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు కలిపి సుమారు 300 మంది కోసం అధికార వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరికోసం ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లో వసతి గృహాలు, ప్రైవేటు హోటళ్లను ముందుగానే అధికారులు బుక్ చేసి ఉంచారు. ఈ మేరకు అక్కడి ఏర్పాట్లను మంత్రి సీతక్క కూడా పర్యవేక్షించారు. ఈ రెండు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, అధికారులు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖ సుమారు 1,500 మంది సిబ్బందితో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది.
