Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?

Supreme court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి తుంగతూరి ప్రభాకర్‌రావు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పురోగతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఎంతవరకు ఇంటరాగేషన్‌ పూర్తి చేశారో వివరించాల్సిందిగా ఆదేశించింది.

‘ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ పూర్తి చేయండి, ఇంకా ఎంతకాలం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?’ అంటూ బెన్చ్‌ కఠినంగా ప్రశ్నించింది. ముఖ్యంగా, తన లక్ష్యం పూర్తయిందా లేదా అన్న విషయంలో దర్యాప్తు సంస్థ సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ‘మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్‌ ఉన్నంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా?’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పూర్వ ప్రభుత్వం కాలంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులపై అక్రమ నిఘా పెట్టారన్న ఆరోపణలతో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావుపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, దర్యాప్తు సంస్థల ప్రక్రియ వేగంపై ప్రశ్నలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు తాజా హితవుతో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో, కేసు దిశ ఏమిటి? తదుపరి చర్యలేంటి? అన్న ప్రశ్నలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *