Jana Nayagan: తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు న్యాయపరమైన చిక్కులు వీడటం లేదు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వివాదంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. అంతేకాకుండా, ఈ నెల 20వ తేదీన విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమాలో కొన్ని రాజకీయ, సామాజిక, కులపరమైన వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఆడియోను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత సింగిల్ బెంచ్ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, సెన్సార్ బోర్డు వెంటనే డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఆ తీర్పుపై స్టే విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమా విడుదల నిలిచిపోయింది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ భాగస్వామ్యం!
సినిమా విడుదల ఆలస్యమైతే తాము భారీగా నష్టపోతామని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి హైకోర్టు పరిధిలోనే ఈ సమస్యను తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఈ నెల 20వ తేదీన వెలువడే తీర్పుపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పటివరకు ఈ సినిమా వెండితెరపైకి రావడం కష్టమనే చెప్పాలి.
