T20 World Cup 2026

T20 World Cup 2026: బీసీబీ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన

T20 World Cup 2026: 2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల కోసం తమ జట్టు భారత్‌కు రాబోదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది. మంగళవారం ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం బీసీబీ వైస్ ప్రెసిడెంట్ షాకావత్ హొస్సేన్ ఈ సంచలన ప్రకటన చేశారు.

భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదు: బీసీబీ తమ జట్టు భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, భారత్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయ వేదికలను చూడాలని ఐసీసీని కోరినట్లు షాకావత్ తెలిపారు. “మేము తీసుకున్న నిర్ణయంపై చాలా స్పష్టంగా ఉన్నాం. భారత్‌కు వెళ్లకూడదనే మా వైఖరి నుండి అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో ఐసీసీకి మా ప్రతిపాదనను పంపించాం, వారు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. చర్చలకు ఇంకా సమయం ఉందని, సానుకూల ఫలితం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: IND Vs NZ: న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

ఐసీసీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన బోర్డు మరోవైపు, ఇప్పటికే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైందని, కాబట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఐసీసీ బీసీబీని కోరింది. అయితే, తమ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని బీసీబీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. షెడ్యూల్ మార్చడం వల్ల వచ్చే ఇబ్బందులను ఐసీసీ ప్రస్తావించినప్పటికీ, బంగ్లాదేశ్ మాత్రం తమ మ్యాచ్‌లను శ్రీలంకకు లేదా ఇతర దేశాలకు మార్చాలని పట్టుబడుతోంది.

షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్‌లు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ తన గ్రూప్-సి మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం, రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాదం ముదిరింది. టోర్నీ ప్రారంభానికి సమయం తక్కువగా ఉండటంతో, ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రీడాలోకం ఆసక్తిగా గమనిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *