Sudha Kongara: తమిళ చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సందడి కాస్తా ‘ఫ్యాన్ వార్’గా మారిపోయింది. దళపతి విజయ్ మరియు శివకార్తికేయన్ అభిమానుల మధ్య మొదలైన ఈ గొడవ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన శివకార్తికేయన్ సినిమా ‘పరాశక్తి’పై విజయ్ అభిమానులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర బృందం తీవ్రంగా మండిపడుతోంది.
దర్శకురాలు సుధా కొంగర సంచలన వ్యాఖ్యలు
తమ సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై దర్శకురాలు సుధా కొంగర ఘాటుగా స్పందించారు. బుక్ మై షో వంటి యాప్‌లలో ఫేక్ ఐడీలతో కావాలనే తక్కువ రేటింగ్ ఇస్తున్నారని, తమ సినిమాను దెబ్బతీయడానికి నీచమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం మేము సినిమా మార్కెటింగ్‌తో కాదు, రౌడీయిజం మరియు గూనిజంతో పోరాడుతున్నాం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పెద్ద హీరో అభిమానులు ఇలా దిగజారి ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదం వెనుక రాజకీయ కుట్ర?
ఈ ఫ్యాన్ వార్ వెనుక కేవలం సినిమాలే కాదు, బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మరియు శివకార్తికేయన్ ‘పరాశక్తి’ రెండు సినిమాలూ సెన్సార్ చిక్కుల్లో పడ్డాయి. అయితే, ‘పరాశక్తి’ చిత్రానికి విడుదలవడానికి కేవలం 4 గంటల ముందు అనుమతి లభించింది. కానీ విజయ్ సినిమాకు మాత్రం సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. పైగా, ‘పరాశక్తి’ చిత్రాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేసింది.
ఇది కూడా చదవండి: Amitov Teja: దర్శకుడు తేజ కుమారుడికి టోకరా.. రూ. 63 లక్షలు గోవిందా !
దీంతో తమ హీరో సినిమాను అడ్డుకోవడంలో రాజకీయ కుట్ర ఉందని, ఉదయనిధి స్టాలిన్ కావాలనే ఇలా చేస్తున్నారని విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపంతోనే వారు శివకార్తికేయన్ సినిమాను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు.
సినిమాకు శాపంగా మారిన ఫ్యాన్ వార్స్
ఒక సినిమా బాగున్నా సరే, హీరోల మధ్య ఉన్న పోటీని అభిమానులు వ్యక్తిగత గొడవలుగా మార్చుకోవడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. సంక్రాంతి వంటి పెద్ద సీజన్లో ప్రేక్షకులు సినిమాలను ఎంజాయ్ చేయాల్సింది పోయి, ఇలాంటి గొడవలను చూడాల్సి రావడం దురదృష్టకరం. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
