Crime News

Crime News: లైంగిక కోరిక తీర్చలేదని మహిళా టెక్కీని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

Crime News: బెంగళూరు నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని పోలీసులు ఛేదించారు. తొలుత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా భావించిన ఈ ఘటన, చివరకు ఒక ఇంటర్ విద్యార్థి చేసిన కిరాతక హత్యగా తేలింది. లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో సదరు యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

అసలేం జరిగింది?

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (34) బెంగళూరులోని రామ్మూర్తినగర పరిధిలో తన స్నేహితుడితో కలిసి ఒక ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఆమె ఫ్లాట్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో షర్మిల మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. బాడీకి నిప్పు అంటుకోకముందే ఆమె చేతిపై గాయాలు ఉండటం మరియు ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: Alyssa Healy Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

కిటికీలోంచి దూరి.. కిరాతకానికి ఒడిగట్టి

సీసీ టీవీ ఫుటేజ్ మరియు స్థానికుల విచారణలో షర్మిల పక్క ఫ్లాట్‌లోనే ఉండే కర్నల్ కురై (18) అనే ఇంటర్ విద్యార్థిపై అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు షర్మిల మిత్రుడు ఇంట్లో లేని సమయం చూసి, కురై కిటికీలోంచి ఆమె గదిలోకి దూరాడు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. ఆమె ప్రతిఘటించి గట్టిగా అరవడంతో, కోపం తట్టుకోలేక వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేశాడు.

సాక్ష్యాలు చెరిపివేసే ప్రయత్నం

తీవ్రంగా గాయపడిన షర్మిల పరుపుపై పడిపోగా, ఆమె అరవకుండా దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమి పెట్టాడు. దీనివల్ల ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత తన నేరం బయటపడకుండా ఉండేందుకు, రక్తపు మరకలు ఉన్న ఆమె బట్టలను తొలగించి అదే గదిలో నిప్పంటించాడు. గది మొత్తం మంటలు వ్యాపిస్తుండగా మళ్ళీ కిటికీలోంచి దూకి పారిపోయాడు. ప్రమాదంలా చిత్రీకరించేందుకు అతడు చేసిన ప్రయత్నం చివరకు పోలీసుల విచారణలో వీగిపోయింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *