IndiGo: గోరఖ్‌పూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం (6E 437) వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగా విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం దెబ్బతింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ వెంటనే వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 216 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా కిందకు దించినట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు.
దెబ్బతిన్న విమానానికి మరమ్మతులు చేపట్టగా, ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో వారి గమ్యస్థానాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, నిబంధనల ఉల్లంఘన కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విధించిన భారీ జరిమానాను అప్పిలేట్ అథారిటీ ఖరారు చేసింది.
ఇది కూడా చదవండి: Toxic: టాక్సిక్ టీజర్ డిలీట్ చేయాలి.. మహిళా కమిషన్ ఫైర్.. యశ్ రియాక్షన్ ఏంటంటే..?
కేటగిరీ-సి విమానాశ్రయాల్లో పైలట్ శిక్షణ కోసం అర్హత కలిగిన సిమ్యులేటర్లను ఉపయోగించలేదన్న ఆరోపణలపై ఇండిగో ఫ్లైట్ ఆపరేషన్స్ డైరెక్టర్, ట్రైనింగ్ డైరెక్టర్లపై గతేడాది సెప్టెంబర్‌లో చెరో రూ. 20 లక్షల జరిమానా విధించగా, దానికి వ్యతిరేకంగా సంస్థ చేసిన అప్పీల్‌ను అథారిటీ కొట్టివేసింది. దీంతో మొత్తంగా రూ. 40 లక్షల జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 1.22 శాతం మేర క్షీణించాయి
