Anvesh: తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో గుర్తింపు పొందిన నా అన్వేషణ చానల్ యజమాని అన్వేష్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నానని అతను వెల్లడించాడు. ఇకపై యూట్యూబ్ కోసం దేశం దేశం తిరగబోనని, ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని కంటెంట్ సృష్టించబోనని అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
అతను ఇప్పటి వరకు దాదాపు 130 దేశాలు సందర్శించినట్లు తెలిపాడు. లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో చాలా మంచి ఆదరణ పొందిన తన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ. 8 కోట్లు సంపాదించానని తెలిపాడు. అంత డబ్బుతో జీవితం ప్రశాంతంగా సాగుతుందని, ఇకపై పరిశ్రమ ఒత్తిడి కోసం ప్రయాణాలు చేయనని స్పష్టం చేశాడు. మిగిలిన దేశాలను వ్యక్తిగత సంతోషం కోసం మాత్రమే చూడనని వెల్లడించాడు.
ఇటీవల గరికపాటి నరసింహారావు మరియు నటుడు శివాజీపై అన్వేష్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారితీశాయి. హిందూ సంఘాల ఆగ్రహం, కేసుల నమోదు, అలాగే వేగంగా తగ్గిన సబ్‌స్క్రైబర్ సంఖ్య ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
అన్వేష్ తన భావి ప్రణాళికలపై కూడా స్పష్టత ఇచ్చాడు. ఇకపై ట్రావెల్ కంటెంట్ కంటే సామాజిక సమస్యలు, ప్రజల సమస్యలపై గళం విప్పాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బాధితుల పక్షాన నిలబడి, సామాజిక మార్పు కోసం శ్రమిస్తానని, ప్రాణం ఉన్నంత వరకు ఈ మార్గంలో పనిచేస్తానని చెప్పాడు.
