Traffic Rush

Traffic Rush: సంక్రాంతి సందడి.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

Traffic Rush: సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఊపందుకున్నాయి. పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లే వారితో విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే కార్లు, బస్సులు క్యూ కట్టడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా టోల్ సిబ్బంది అదనపు బూత్‌లను తెరిచి ఉంచారు.

గణాంకాలను పరిశీలిస్తే, శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకే దాదాపు 70 వేల వాహనాలు పంతంగి టోల్‌గేట్ దాటి ఏపీ వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సెలవు దినం కావడంతో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్‌ స్కాన్ త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సాయం చేయడానికి పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు మరియు క్రేన్‌లను హైవేపై సిద్ధంగా ఉంచారు.

మరోవైపు, ఏపీలోని నందిగామ సమీపంలో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అక్కడ రోడ్డు పనులు జరుగుతుండటంతో వై-జంక్షన్ వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ నెమ్మదించి ప్రయాణ సమయం పెరుగుతోంది. సొంత వాహనాల్లో వెళ్లేవారు ట్రాఫిక్ అప్‌డేట్స్ గమనిస్తూ, తగిన జాగ్రత్తలతో ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *