Hyderabad: డ్రగ్ కంట్రోల్ హెచ్చరిక.. పిల్లలకు ఈ సిరప్ వాడకండి..

Hyderabad: తెలంగాణలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే పరిణామం వెలుగులోకి వచ్చింది. చిన్నారుల్లో అలర్జీ, దురద, జలుబు చికిత్స కోసం విస్తృతంగా వాడుతున్న Almont-Kid సిరప్ వాడకాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సూచించింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిర్వహించిన రసాయన పరీక్షల్లో ఈ మందులో ప్రమాదకరమైన ఎథిలీన్ గ్లైకాల్ పదార్థం అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ మందు ప్రత్యేకంగా AL-24002 అనే బ్యాచ్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. బీహార్‌లోని హజీపూర్‌లో ఉన్న Tridus Remedies ఈ సిరప్‌ను తయారు చేసింది. ల్యాబ్ టెస్టులో ప్రమాదకర రసాయనం మమేరులో ఉన్నట్లు గుర్తించడంతో Telangana Drugs Control Administration కు CDSCO అత్యవసర నోటీసు పంపింది.

దీనితో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రాష్ట్రంలోని అన్ని ఫార్మసీలు, మెడికల్ స్టోర్లు, ఆసుపత్రులకు స్టాప్ యూజ్ నోటీస్ జారీ చేశారు. ఈ బ్యాచ్ సిరప్‌ను వెంటనే విక్రయం నిలిపివేయాలని, ఉన్న స్టాక్‌ను సంస్థకు తిరిగి తీసుకునే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లు స్టాక్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

సాధారణంగా పిల్లలలో మంట, దురద, అలర్జీ వల్ల వచ్చే జలుబు వంటి సమస్యలకు ఈ సిరప్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులోని ఎథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం శరీరంలో చేరితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నారులకు ఇది మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధికారులు ప్రజలకు సైతం సూచనలు జారీ చేశారు. ఇళ్లలో Almont-Kid సిరప్ ఉంటే వెంటనే వాడకం నిలిపివేయాలని, షాప్‌లు లేదా ఆసుపత్రుల్లో కనిపిస్తే సంబంధిత ఫార్మసిస్ట్‌లకు లేదా డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని పిల్లలకు ప్రత్యామ్నాయ మందులను మాత్రమే వాడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *