AP TET Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుడు కావాలని కలలుగనే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న టెట్ (AP TET 2025) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల మార్కులను ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 2,48,427 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈసారి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం సుమారు 39.27 శాతంగా నమోదైంది. అంటే పరీక్ష రాసిన వారిలో మొత్తం 97,560 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కేవలం కొత్త అభ్యర్థులే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న 31,886 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్ష రాశారు. వారిలో దాదాపు 47.82 శాతం మంది ఉపాధ్యాయులు మంచి మార్కులతో పాస్ అయ్యారు. పరీక్ష ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలన్నింటినీ నిపుణులతో పరిశీలించిన తర్వాతే ఈ తుది ఫలితాలను ప్రకటించినట్లు టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
అభ్యర్థులు తమ ఫలితాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఇందుకోసం రెండు వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చింది. మీరు https://tet2dsc.apcfss.in లేదా http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చూడవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ వాడకం ఇబ్బందిగా ఉంటే, ప్రభుత్వం కొత్తగా వాట్సప్ సదుపాయం కూడా కల్పించింది. 9552300009 అనే వాట్సప్ నంబర్ ద్వారా కూడా మీ ఫలితాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది.
