ACB Raids: తెలంగాణ ఏసీబీ దూకుడు మీదున్నది. గత 2025 సంవత్సరంలో పెద్ద ఎత్తున దాడులు చేసి అవినీతి పరుల పన్నాగాన్ని విచ్ఛిన్నం చేసింది. అవినీతి చెదలును దుమ్ము దులిపేందుకు పెద్ద ఎత్తున జనంలో ప్రచారం కల్పిస్తూ వస్తున్నది. ఈ మేరకు వందలాది కేసులు నమోదు కాగా, లక్షలాది రూపాయల నగదును బాధితుల చెంతకు చేరింది. ఇదే ఒరవడితో 2026వ సంవత్సరంలోనూ తగ్గేదే లే.. అంటూ దూకుడు పెంచుతున్నది. అవినీతి పరుల గుండెల్లో హడలు పుట్టిస్తున్నది.
ACB Raids: ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో తొలి, మలి కేసులు పోలీస్ శాఖలోనే నమోదు కావడం గమనార్హం. గతంలో అవినీతి చీడ పట్టుకున్న ఆ శాఖలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాల, ఉన్నతాధికారుల సంస్కరణలతో కొంత అవినీతి జాఢ్యం తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయినా ఆ శాఖలో కొందరు లంచావతారులు తమ వక్రబుద్ధిని వదులుకోలేకపోతున్నారు. రెండో వరుసలో రెవెన్యూ అధికారులు ఉండటం గమనార్హం.
ACB Raids: ఓ కేసులో నుంచి ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు సైబరాబాద్ పరిధిలోని కొల్లూరు ఎస్ఐ డబ్బులు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఈ విషయంలో రూ.30 వేలు డిమాండ్ చేసిన ఆ ఎస్ఐ తొలుత రూ.5 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో రూ.20 వేలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raids: పేకాట ఆడిన కేసులో ఓ నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏసీబీ అధికారులకు తాజాగా పట్టుబడ్డాడు. బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయగా, ఆ నగదును పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇలా తొలి మలి కేసులు పోలీస్ శాఖలోనే నమోదు కావడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. అధికారులు, సిబ్బందిలో ఎంతగా చైతన్యం తెస్తున్నా ఇంకా కొందరిలో లంచం బుద్ధి మానకపోవడంపై అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా ఏసీబీ సూచిస్తున్నది.
