Cp sajjanar: హైదరాబాద్లో చైనా మాంజా వినియోగంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక నిర్ణయం ప్రకటించారు. మకర సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, లేదా వాడినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిషేధిత మాంజాతో గాలి పటాలు ఎగరేయడం వల్ల ప్రమాదాలు సంభవించినా, గాయాలు కలిగినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలతో పాటు పక్షులకు, విద్యుత్ లైన్లకు, వాహనదారులకు తీవ్రమైన హానికలిగించే చైనా మాంజాను పూర్తిగా అరికట్టేందుకు అదనపు పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చైనా మాంజా వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నవారిపై పరిస్థితులనుబట్టి పీడీయాక్ట్ వర్తింపచేయడానికి కూడా సిపి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సంక్రాంతి వేడుకలు సురక్షితంగా సాగేందుకు ప్రజల సహకారం అత్యవసరం అని సజ్జనార్ పిలుపునిచ్చారు.
