ED Raids: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి. బొగ్గు కుంభకోణం (Coal Scam) కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు గురువారం కోల్‌కతాలోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐప్యాక్’ (IPAC) కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. కేవలం కార్యాలయంలోనే కాకుండా, ఐప్యాక్ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
నేరుగా రంగంలోకి ముఖ్యమంత్రి
ఐప్యాక్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయన్న వార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఏజెన్సీలు తనిఖీలు చేసేటప్పుడు ముఖ్యమంత్రులు దూరంగా ఉంటారు, కానీ మమతా బెనర్జీ నేరుగా కార్యాలయం లోపలికి వెళ్లి, ఒక ఫైల్‌ను చేత్తో పట్టుకుని బయటకు రావడం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. కేంద్ర సంస్థలు తమ పార్టీ వ్యూహాలను, ఓటర్ల సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హోం మంత్రిపై మమత విమర్శల బాణాలు
ఈ సోదాల వెనుక కేంద్ర హోం మంత్రి హస్తం ఉందని మమతా బెనర్జీ బహిరంగంగా ఆరోపించారు. “పార్టీ హార్డ్ డిస్క్‌లు, ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకోవడమే ఈడీ పనినా? ఇదంతా హోం మంత్రి సూచనల మేరకే జరుగుతోంది” అని ఆమె మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Aus vs Eng Test Series: తప్పులను సరిదిద్దుకుంటాం!.. యాషెస్ ఓటమిపై బెన్ స్టోక్స్ రియాక్షన్
తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఐటీ సెల్‌లోని కీలక పత్రాలను ఈడీ తీసుకువెళ్తోందని, ఎన్నికల ముందు తమ పార్టీ సమాచారాన్ని సేకరించి ఇబ్బంది పెట్టడమే బీజేపీ వ్యూహమని ఆమె ఆరోపించారు. ఒకవేళ తాను బీజేపీ కార్యాలయాలపై ఇలాగే సోదాలు చేయిస్తే పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
రాజ్యాంగ ఉల్లంఘన అంటూ బీజేపీ ఎదురుదాడి
మమతా బెనర్జీ తీరుపై బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి తీవ్రంగా స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడీ పనిలో జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. “మమతా బెనర్జీ ఇంట్లో సోదాలు చేస్తే ఏకంగా 100 కోట్ల రూపాయల నగదు దొరుకుతుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.
బొగ్గు కుంభకోణం కేసులో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది పక్కన పెడితే, ఐప్యాక్ కార్యాలయం వేదికగా సాగుతున్న ఈ ‘ఈడీ వర్సెస్ దీదీ’ పోరు బెంగాల్‌లో రాబోయే ఎన్నికల యుద్ధానికి నాందిగా కనిపిస్తోంది. కేంద్ర ఏజెన్సీలు తమ పని తాము చేస్తున్నాయా లేక రాజకీయ కక్షసాధింపులో భాగమేనా అన్న చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో మొదలైంది.
