Venkatesh: ఈ సంక్రాంతి పండుగ పూట వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తన స్పీచ్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
చిరంజీవి గారితో స్క్రీన్ పంచుకోవడం తనకు దక్కిన అద్భుతమైన అవకాశమని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సినిమాలో తామిద్దరం కలిసి చేసిన రచ్చ థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. “గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి తమ్ముళ్లతో కలిసి మల్టీస్టారర్స్ చేశాను, కానీ ఇప్పుడు ‘అన్నయ్య’ చిరంజీవి గారితో కలిసి వస్తున్నాను.. థియేటర్లలో సౌండ్ అప్పటికంటే పదిరెట్లు ఎక్కువగా ఉండాలి” అంటూ వెంకీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి గారి మాస్ మేనరిజమ్స్ తోడైతే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Congress Party: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు.. 5 రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పరిశీలకుల ఎంపిక
ఈ చిత్రంలో చిరంజీవి మాజీ NIA ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, నయనతార ‘శశిరేఖ’గా ఆయనకు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘మెగా విక్టరీ’ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. కేవలం వినోదం కోసమే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని, సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలు ఘనవిజయం సాధించి అన్ని విభాగాల వారు బాగుండాలని వెంకటేష్ కోరుకోవడం ఆయన సంస్కారానికి అద్దం పడుతోంది.
ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత సహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ వంటి ప్రముఖ గీత రచయితలు సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని తెలిపారు. మొత్తానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో మెగాస్టార్ ఈ సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టబోతున్నారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
