Crime News

Tirupati: అక్రమ సంబంధానికి నిరాకరించిందని చంపేసిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌

Tirupati: అక్రమ సంబంధాల నేపథ్యంలో భర్త లేదా భార్య ప్రాణాలు తీయడం వంటి ఘటనలను కొన్ని రోజుల నుండి మనం చూస్తున్నాం. నెలకు రెండు లేదా మూడు ఇలాంటి కేసులైనా వింటుంటాం. కానీ తిరుపతిలో మరో విభిన్నమైన ఘటన జరిగింది. అక్రమ సంబంధానికి సదరు మహిళ అంగీకరించకపోవడంతో ఆమెను హత్య చేసి, అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కొర్లగుంట మారుతీనగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి ఈస్ట్ (తూర్పు) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. కొంత కాలం బాగానే ఉన్నా, తరచూ జరుగుతున్న గొడవల వల్ల ఆ జంట విడాకులు తీసుకున్నారు. తర్వాత సోమశేఖర్ కొర్లగుంటలోని మారుతీనగర్‌లో ఒంటరిగా ఉంటూ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిలో చేరాడు. అదే సమయంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి తిరుపతిలోని జీవకోనకు వచ్చి నివాసం ఉంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న సమోసా షాపులో లక్ష్మి పనికి చేరింది.

ఇది కూడా చదవండి:Adilabad: మాజీ మంత్రి అరెస్టు

షాపులో గ్యాస్ సిలిండర్లు వేయడానికి వచ్చే సోమశేఖర్‌కు లక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఎందుకో తెలియదు కానీ, లక్ష్మికి ఈ సంబంధం నుండి బయటకు రావాలనిపించి సోమశేఖర్‌కు ఆ విషయం చెప్పింది. కానీ ఈ విషయం సోమశేఖర్‌కు నచ్చలేదు. చేసేది లేక చివరిసారిగా నీతో ఒంటరిగా మాట్లాడాలని ఉంది అంటూ ఆమెను తన గదికి తీసుకొచ్చాడు. అక్కడే ఆమెను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *