CP sajjanar: ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి..

Cp sajjanar: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత ఊర్లకు వెళ్లే హైదరాబాద్ నగరవాసులకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ప్రయాణానికి ముందే తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసిన సీపీ సజ్జనార్, పండుగ సెలవుల సమయంలో చాలా కుటుంబాలు ఊర్లకు వెళ్తాయని, ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రయాణానికి ముందు సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందిస్తే, ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సీపీ సూచించారు. అవి బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని తెలిపారు. ఈ చిన్న జాగ్రత్తలతో పండుగను ప్రశాంతంగా, భద్రంగా జరుపుకోవచ్చని అన్నారు.

నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాకుండా, ముందుగానే నేరాలను నివారించడం కూడా ఆధునిక పోలీసింగ్‌లో భాగమని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజల ఆస్తుల భద్రతకు హైదరాబాద్ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సీపీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *