IPL: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం..

Ipl: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు, కార్యక్రమాలను ప్రసారం చేయవద్దని ఆదేశించింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్. 2026 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు అతడు కీలక ఆటగాడిగా నిలుస్తాడని భావించారు. అయితే, ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయానికి సరైన కారణాలు వెల్లడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసాత్మక ఘటనలు, వాటిపై భారత్‌లో వచ్చిన విమర్శల నేపథ్యంలోనే ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం బంగ్లాదేశ్ ప్రజలను తీవ్రంగా కలచివేసిందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో,
“2026 మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీలో మా దేశానికి చెందిన స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సహేతుకమైన కారణం చూపలేదు. ఇది బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది” అని పేర్కొంది.

అంతేకాక,
“ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అన్ని ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయించాం” అని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *