Siddipet: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ వైద్యురాలు గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హౌస్‌సర్జన్ (ఇంటర్న్)గా పనిచేస్తున్న డాక్టర్ లావణ్య (25) శనివారం నాడు తన శరీరంలోకి గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తోటి సిబ్బంది గమనించి వెంటనే సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Thrissur: రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం .. 200 బైకులు అగ్నికి ఆహుతి
హైదరాబాద్‌లో వైద్యులు ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, శరీరంలో విషం వేగంగా వ్యాపించడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యురాలే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆమె కుటుంబ సభ్యులను, తోటి వైద్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ లావణ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పని ఒత్తిడి కారణమా లేక వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
