Road Accident: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో స్థిరపడి ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటున్న తెలుగువారిని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మేరీల్యాండ్‌లో నిఖిత గోడిశాల హత్య ఉదంతం మరువక ముందే, వాషింగ్టన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆయన భార్య ఆశ (40) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం పశ్చిమ గోదావరి జిల్లాలో పెను విషాదాన్ని నింపింది.
వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కృష్ణ కిశోర్ గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పది రోజుల క్రితమే తమ స్వగ్రామమైన పాలకొల్లు వచ్చి, బంధుమిత్రులను కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో దుబాయ్‌లో కొత్త ఏడాది వేడుకలను ఘనంగా జరుపుకున్న ఈ దంపతులు, అమెరికా చేరుకున్న కొద్ది రోజులకే కాలగర్భంలో కలిసిపోతారని ఎవరూ ఊహించలేదు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సమయంలో వారితో పాటు ఉన్న కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tanakallu: పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్య: తనకల్లులో కలకలం
ఇటీవల కాలంలో అమెరికాలో తెలుగువారిపై జరుగుతున్న దాడులు, వరుస ప్రమాదాలు ప్రవాస భారతీయులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారమే తెలంగాణకు చెందిన మేఘనారాణి, కడియాల భావన అనే ఇద్దరు యువతులు అలబామా హిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు పాలకొల్లు దంపతుల మరణవార్త ఆ గాయాన్ని మరింత పెద్దది చేసింది. పది రోజుల క్రితం తమ కళ్లెదుట తిరిగిన కృష్ణ కిశోర్ దంపతులు ఇక లేరనే వార్తను పాలకొల్లు వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. విదేశాల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో, ఈ వరుస విషాదాలు తెలుగు లోగిళ్లలో తీవ్ర వేదనను మిగిల్చాయి.
