Chamala kiran: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారని ఆయన గుర్తు చేశారు. ఇది రేవంత్ రెడ్డి మనసులో ఎలాంటి ద్వేషం లేదనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చామల విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ప్రజలకు వాస్తవాలు వివరించారని తెలిపారు. నీళ్ల విషయంలో కేసీఆర్ కూడా ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన సూచించారు.
గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు ప్రజల కోసమా లేక కమిషన్ల కోసమా అన్న సందేహాలు ఉన్నాయని చామల తీవ్రంగా దుయ్యబట్టారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాల వల్లే రాష్ట్రం నష్టపోయిందని, ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా, నిన్న అసెంబ్లీలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికార మదంతో, బలుపు మాటలతో మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, కేసీఆర్ను ఉద్దేశించి అనరాని వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాగ్వాదాలకంటే ప్రజలకు నిజాలు చెప్పడమే ముఖ్యం అని, రాజకీయ దుష్ప్రచారాలను ప్రజలు తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు.
