Fire Accident: కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. స్టేషన్ ఆవరణలోని పెయిడ్ పార్కింగ్ షెడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో పార్కింగ్ చేసిన వందలాది ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
నిప్పురవ్వ తెచ్చిన నిలువు ద్రోహం
ఆదివారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. పార్కింగ్ షెడ్ పైనుంచి వెళ్తున్న ఒక విద్యుత్ తీగ తెగి నేరుగా కింద ఉన్న బైక్‌లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. తొలుత రెండు మోటార్ సైకిళ్లలో మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలో అవి పక్కనే ఉన్న వందలాది వాహనాలకు వ్యాపించాయి. పెట్రోల్ ట్యాంకులు పేలడంతో మంటలు మరింత ఉధృతమయ్యాయి.
భారీగా ఆస్తి నష్టం
ప్రమాద సమయంలో సదరు పార్కింగ్ షెడ్‌లో సుమారు 400 నుండి 600 వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ మంటల్లో దాదాపు 500కు పైగా బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి.కేవలం వాహనాలే కాకుండా, టిన్ షీట్లతో నిర్మించిన భారీ పార్కింగ్ షెడ్ కూడా కుప్పకూలింది. మంటల తీవ్రతకు రెండో గేటు వద్ద ఉన్న టికెట్ కౌంటర్, అక్కడే నిలిపి ఉంచిన ఒక తనిఖీ వాహనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Anil ravipudi: ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుంది
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందిన వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. స్థానికులు, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మంటలకు దూరంగా వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాహనదారులు తమ వాహనాల స్థితిని తెలుసుకునేందుకు స్టేషన్‌కు పోటెత్తారు.
దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
ఈ ఘటనపై కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని త్రిసూర్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం ప్రత్యేక విచారణ ప్రారంభించారు. పార్కింగ్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? లేదా ఇది కేవలం సాంకేతిక లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికులు తమ వాహనాల భద్రత కోసం రైల్వే పార్కింగ్‌ను నమ్ముకుంటే, ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పార్కింగ్ ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ పద్ధతులను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
